హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రముఖ కవి, అభ్యుదయ రచయిత, నవచేతన పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు ఏటుకూరి ప్రసాద్‌కు పలువురు సీపీఐ లీడర్లు, కవులు, కళాకారులు అభ్యుదయ రచయితలు ఘనంగా నివాళులర్పించారు. 90 ఏండ్ల ప్రసాద్ శనివారం నారాయణగూడలోని ఆయన నివాసంలో వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో పలువురు లీడర్లు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి తుది వీడ్కోలు పలికారు.
అనంతరం పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ సీనియర్ లీడర్లు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా తదితరులు ప్రసాద్భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ.. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు. తుదిశ్వాస వరకు సీపీఐ సభ్యుడిగా కొనసాగిన ఏటుకూరి ప్రసాద్ అభ్యుదయ రచయితల సంఘం(అరసం) పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
